డాక్టర్ మార్గం లక్ష్మీ నారాయణ ప్రొఫైల్

పేరు : డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ

తల్లిదండ్రులు : మార్గం (పెద్దూరి) మంగమ్మ – మార్గం రామస్వామి

సహధర్మ చారిని: శ్రీమతి మార్గం (పెద్దూరి) రమ

పిల్లలు : మార్గం సాయి సందీప్ తేజ, సాత్విక మార్గం

పుట్టిన తేదీ: 21-06-1970

పుట్టిన స్థలం : షోలాపూర్, మహారాష్ట్ర – బతుకుతెరువు కోసం వలస పోయిన అమ్మానాన్నలు

తల్లి, తండ్రి, తాత, ముత్తాతల జన్మస్థలం సిరిసన్న గూడెం (అమ్మ), ఉప్పర గూడెం (నాన)

విద్య :
పీహెచ్.డి – డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ – గిరిజన విజ్ఞాన పీఠం, ఓరుగల్లు ప్రాంగణం, గిరిజన అధ్యయన శాఖ, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్

ఎం. సి. జె. – మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం – శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్

ఎం. ఎ. – మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ – పొలిటికల్ సైన్స్ – ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాద్

బి. సి. జె. – బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం – కాకతీయ విశ్వ విద్యాలయం, వరంగల్

బి. ఎ. : బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ – ఇ.పి.పి. – ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హనుమకొండ – కాకతీయ విశ్వ విద్యాలయం, వరంగల్

ఇంటర్మీడియట్ : సి. ఇ. సి. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, స్టేషన్ ఘనపూర్, వరంగల్, ఇప్పుడు జనగామ జిల్లా.

ఎస్.ఎస్. సి. : జెడ్.పి.ఎస్.ఎస్. పాలకుర్తి

సాంకేతిక విద్యార్హతలు : పి.జి. డి. సి. ఎ. – పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్

చిరునామా : పాలకుర్తి – 506146
జనగామ జిల్లా.

ఫోన్ : 9848997273

Profile of Dr. Margam Lakshmi Narayana



జర్నలిస్టుగా...

ఇంటి పేరు మార్గంగానే అందిరికీ సుపరచితులైన మార్గం లక్ష్మీనారాయణ ది జర్నలిస్టుగా మూడు దశాబ్దాల పైగా సుదీర్ఘ ప్రయాణం. అనుభవం. థర్టీ ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ. చిన్న వయసులోనే జర్నలిజాన్ని కెరీర్ గా ఎంచుకుని స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. 1987లో ఉదయంలో ఓనమాలు దిద్దుకొని, 1991లో ఈనాడులో వరంగల్ జిల్లా పాలకుర్తి – కాంట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించారు. అప్పటి నక్సలిజం ఉధృతిలో అదరక, బెదరక ఆ వార్తలు రాసేవారు. నక్సలైట్లు కొందరిని చితకబాదిన ఘటనని తన మొదటి వార్తగా రాసి, ధైర్యంగా అచ్చేయించుకున్న ధీశాలి. అప్పటి సీనియర్ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ గా కూడా వ్యవహరించిన నెమరుగొమ్ముల యతిరాజారావుపై కూడా వార్తలు రాసి ఔరా?! అనిపించుకున్నారు. రెండేండ్లు తిరగక ముందే అప్పటి ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ లో చేరి, ఉప సంపాదకుడిగా (సబ్ ఎడిటర్) రెండేళ్ళు పని చేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ గారి ఆధ్వర్యంలో అప్పట్లో వెలువడిన వార్తాకాలం వీక్లీలో, స్వర్గీయ చెన్నూరి నాగరాజు గారి ఆధ్వర్యంలో వెలువడిన సాక్షి (ఇప్పటి సాక్షి దిన పత్రిక మాతృక) వీక్లీలో కొంత కాలం ఉప సంపాదకునిగా పని చేశారు. ఆతర్వాత ఆంధ్రభూమిలో మరికొంత కాలం పని చేశారు. 2000లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యవహారాల గౌరవ సలహాదారు శ్రీ కె.రామచంద్రమూర్తి గారు ఎడిటర్ గా ఉన్న వార్త దిన పత్రికలో మహబూబ్ నగర్ జిల్లా, అప్పటి డివిజన్ కేంద్రంలో (ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం) రీజనల్ స్టాఫ్ రిపోర్టర్ గా చేరి నాలుగున్నర ఏళ్లు పని చేశారు. అప్పట్లో మార్గం రాసిన “నిన్న బండ చాకిరీ కొండమ్మ, నేడు పాఠాల పంతులమ్మ” అనే స్ఫూర్తిదాయక వాస్తవ గాథతో వార్తలో “జీవన విజయం” శీర్షిక మొదలైంది. బట్టలుతికి ఇంటింటికీ వేసే ఓ చాకలి అమ్మాయి… తన 15వ ఏట అక్షరాభ్యాసం చేసి, ప్రభుత్వ పంతులమ్మ అయిన తీరుని వివరించిన కథనం ఇది. మార్గం లక్ష్మీ నారాయణ రాసిన ఇదే కథనం…సాక్షి ప్రారంభ సమయంలో, పూర్వ ఆంధప్రదేశ్ రాష్ట్రం (నేటి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్) లోని ఆ పత్రిక జర్నలిస్టుల శిక్షణా తరగుతుల్లో పతాకగా మారింది. అప్పటి నెట్ వర్క్ ఇన్ చార్జీ లక్ష్మణ్ రావు గారు, తన సుదీర్ఘ 25 ఏళ్ళ జర్నలిజంలో అనుభవంలోకి వచ్చిన 5 అద్భుత వార్తా కథనాలను వివరిస్తూ, రెండో అద్భుత వాస్తవ వార్తా కథనంగా “నాడు బండచాకిరీ కొండమ్మ, నేడు పాఠాల పంతులమ్మ” కథనాన్ని వివరించడం మరచిపోలేని అపూర్వ ఘటన.

ఓ జీతగాడి విజయగాథని “నిన్న జీతగాడు, నేడు ప్రధానోపాధ్యాయుడు” గా మార్గం రాసిన వ్యాసం జీవన విజయం శీర్షిక కొనసాగింపునకు రాసిన మరికొన్ని కథనాలు. మార్గం లక్ష్మీ నారాయణ
రాసిన “సర్పంచ్ గా రెండేళ్ళు గౌతంకి నిండూ నూరేళ్ళు…”, “నర పశువుకి వెలకట్టి, చిట్టి తల్లిని బలి పెట్టారు...”, “వెంటాడిన కరువు, వేటాడిన మృత్యువు“, “ఆనంద భాష్పాల మధ్య వీషాద వీచికలు“, “పల్లె నుండి ఢిల్లీ దాకా పాలమూరేఎవరికి వారే… ప్రగతి మాత్రం యమునా తీరే…”, “నక్సల్స్ ఇంటర్వ్యూలు“, “పల్లె నుంచి ప్రాజెక్టుల దాకా”, ఏ ఒక్క అంశాన్నీ వదలకుండా… పాలమూరు ప్రజా గోసని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక, వలసల అంశాలని అనేక విధాలుగా రాసిన అనుభవం మార్గంది. అలిపిరి ఘటన తర్వాత అప్పటి సిఎం చంద్రబాబు, కృష్ణానదీ పరివాహకంలో చేపలు పట్టి జీవించే ప్రజలను పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయించిన సందర్భంగా వరసగా రాసిన కథనాలు వార్త మెయిన్ లో వచ్చాయి. 2000లోనే “కుల వృత్తులు అంతరించిపోనున్నాయా?”, “చేనేత హస్తకళగానే మిగలనుందా?” వంటి ఎంతో ముందు చూపుతో ఆలోచింప చేసే వ్యాసాలు మార్గం రాశారు. దాదాపు అదే సమయంలో “పల్లె కన్నీరు పెడుతుందా కనిపించని కుట్రల అనే పాటని గోరటి వెంకన్న రాయడం కేవలం యాధృచ్చికం.

2004 ఎన్నికలు ముగిసిన వెంటనే వరంగల్ బ్యూరో రిపోర్టర్ గా బదిలీ అయ్యారు. 2007 లో సూర్య దినపత్రిక ఆరంభానికి ముందే స్టాఫ్ రిపోర్టర్ గా చేరి, బ్యూరో ఇన్ చార్జీగా, బ్యూరో చీఫ్ గా ఎదిగారు.

08-08-2008న మార్గం లక్ష్మీ నారాయణ ఎలక్ట్రానిక్ మీడియా ఆరంగేట్రం జరిగింది. ఇప్పటి ఎన్టీవీ సిఇఓ రాజశేఖర్ గారు, వీ6 సిఇఓ అంకం రవి గారల ఆధ్వర్యంలో…ఐ-న్యూస్ హైదరాబాద్ లో చేరి, అనతి కాలంలోనే ఫీచర్స్ హెడ్ గా మార్గం ఎదిగారు. 20 ఏళ్ళ ప్రింట్ మీడియా అనుభవంతో ఐ-న్యూస్ లో ప్రేక్షకాదరణ పొందిన అనేక ఫీచర్స్ ని పరిచయం చేశారు. నీతికి నిలబడి, అమూల్యమైన పదవులు దక్కినా, పైసా సంపాదించుకోకుండా, నిస్వార్థంగా, అతి సామాన్యంగా బతికే ప్రజాప్రతినిధుల మీద “నూటికొక్కరు” శీర్షికతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎడారి దీవులని ఓయాసిస్సులుగా నమ్ముకున్న, బండబారిన బతుకులపై “ఎండమావులు” వంటి అనేక ఫీచర్స్ రాశారు. 2009 ఎన్నికలు రావడంతో ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర0లో ఎన్నికల సర్వేలు నిర్వహించి, ప్రజాభిప్రాయాన్ని అంచనావేసి, ఫలితాల అంచనాలను ముందే ఐ న్యూస్ చానల్ ద్వారా ప్రపంచానికి మార్గం చాటారు. బలమైన వ్యంగ వీచికలతో, పవర్ ఫుల్ పంచ్ లతో, సూటిగా మరెవరికీ సాటిలేని విధంగా ఐ-న్యూస్ లో మార్గం “ఎడిటోరియల్స్” రాశారు. ఈ ఎడిటోరియల్స్ ని ఓ పుస్తకంగా తెచ్చే ఆలోచనలో ఉన్నారు.

అకుంఠిత దీక్ష, అలుపెరుగని దక్షతతో మెల్లిగా ఎలక్ట్రానిక్ మీడియా మెలకువలు తెలుసుకుని, బహుళ ప్రేక్షకాదరణ పొందిన ఫీచర్ “పిన్ కౌంటర్” ద్వారా మార్గం మరింత పేరుని తనతో పాటు ఛానల్ కి సంపాదించారు. ఈ దశలోనే తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా దశ, దిశలు మార్చిన టీవీ9 యాజమాన్యం దృష్టిని మార్గం ఆకర్షించారు. అప్పటి సిఇఓ రవి ప్రకాశ్ స్వయంగా టీవీ9 లోకి ఆహ్వానించారు. టీవీ9 ఆధ్వర్యంలోనే నడిచిన “జై తెలంగాణ”, “టీవీ 1” చానల్ కి ఇన్ చార్జీగా అవకాశం ఇచ్చారు. టీవీ 1 కోసం వ్యంగ్యాస్త్రాల “ఫన్ టెన్”ని రాశారు. అప్పటి టీవీ1 హెడ్ శ్రీనివాసరెడ్డి తో కలిసి “టీవీ1″లో రెగ్యులర్ న్యూస్ ని మార్గం లక్ష్మీ నారాయణ ప్రారంభించారు.

ప్రోమో ల మొదటి ప్రయోక్త మార్గమే
ఈ సమయంలోనే టీవీ9 కి సంచలనాత్మకమైన అనేక “నిఘా స్టోరీ”లు మార్గం రాశారు. తెలుగు టీవీ చరిత్రలో మొట్టమొదటి సారిగా మొదలు పెట్టిన “ప్రోమో”లు మొట్టమొదటిగా రాసింది మార్గమే. ప్రసారం కాబోయే కథనాలకు ఆసక్తిని రేకెత్తించే, తప్పక చూడాలనిపించే విధంగా అతి తక్కువ మాటలతో ఎంతో ఆకర్షణీయంగా, ఆకట్టుకునే విధంగా, ప్రభావితంగా రాసే దృశ్యశ్రవణ ప్రక్రియ ఈ ప్రోమోలు. ఏక కాలంలో టీవీ9లో ప్రోమోలు, నిఘా స్టోరీలు, టీవీ1 లో ఇంచార్జీ బాధ్యతలు నిర్వర్తించిన నేర్పరి, కష్టజీవి మార్గం. ఈ సమయంలో టీవీ9 గెస్ట్ హౌస్ మార్గం మకాంగా మారిందంటే ఎంత బిజీ షెడ్యూల్ తో మార్గం పని చేసేవాడన్నది అర్థం అవుతుంది. ఇక రేపు తెర మీద ఏం నడపాలనే టీవీ9 ప్లానింగ్ లో సైతం మార్గం, సిఇఓ రవి ప్రకాశ్, అప్పటి అవుట్ పుట్ ఎడిటర్ స్వర్గీయ అరుణ్ సాగర్, ప్రస్తుత టీవీ 5 సిఇఓ దినేష్ ఆకుల వంటి వాళ్ళతో కలిసి పని చేశారు.

సరిగ్గా ఈ దశలోనే మార్గంని మరో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. కనీసం దరఖాస్తు కూడా లేకుండానే, దేశంలోనే రెండో అతి పెద్ద టీవీ చానళ్ళ నెట్ వర్క్ గల ప్రఖ్యాత సన్ నెట్ వర్క్ సంస్థ మార్గంని “అవుట్ పుట్ ఎడిటర్” గా ఆహ్వానించింది. విషయం తెలిసిన రవి ప్రకాశ్ మార్గంని స్వయంగా పిలిచి తమతోనే ఉండాలని అడిగారు. అయితే, కెరీర్ కోసం మార్గం ఆ పోస్టుని అంగీకరించారు.

ఇదే తరుణంలో అప్పుడే ఆరంభిస్తున్న ఎక్స్ ప్రెస్ టీవీ యాజమాన్యం మార్గం పని తనాన్ని గుర్తించి, ఆ చానల్ తెలంగాణ రాష్ట్ర పూర్తి బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ రిపోర్టర్ల రిక్రూట్ మెంట్ సహా అనేక బాధ్యతలు చేపట్టారు. చానల్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ మార్గం బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే టైమ్ లో 2014 ఎన్నికలు రావడంతో ఆ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బిగ్ ఎక్స్ ప్రెస్ పేరుతో బిగ్ డిబేట్లను మార్గం నిర్వహించారు. తద్వారా ప్రజాభిప్రాయాన్ని అంచనావేసి, ముందే ఫలితాల అంచనాలను ఎక్స్ ప్రెస్ చానల్ ద్వారా ప్రపంచానికి చాటారు. తనకున్న వార్తా కవరేజీ, విశ్లేషణ శక్తిని, సుదీర్ఘ అనుభవం ద్వారా కలిగిన పరిచయాలని గుర్తించిన యాజమాన్యం మార్గంని ఆతర్వాత ఇదే చానల్ లో స్పెషల్ కరెస్పాండెంట్ గా మార్చేసింది.

అప్పటి దాకా తెర వెనుక మాత్రమే కనిపించే మార్గం, ఇక తెర ముందు మళ్ళీ మరోసారి విజృంభించారు. అప్పుడే లోగో పట్టిన ట్రేనీలా… తన అనుభవాన్ని మేళవించి… చేయని ఇంటర్వ్యూ లేదు. మంత్రుల నుంచి మామూలు మనుషుల దాకా, ఎక్స్ పర్ట్ ల నుంచి ఎన్నో విభాగాల వరకు, ఎన్నికల నుంచి ఉప ఎన్నికల దాకా, మీటింగుల నుంచి ప్లీనరీల దాకా…అసెంబ్లీ నుంచి కౌన్సిల్ దాకా పోలిటికల్ నుంచి క్రైమ్ దాకా, సాంస్కృతికం నుంచి సినిమా నటుల దాకా, ఆయుత చండీయాగం నుంచి అనంతంగా… మార్గం చేయని ఇంటర్వ్యూ లేదు. కవర్ చేయని కవరేజీ లేదు. అలాగే మార్గం ఐ న్యూస్, Express Tv వంటి న్యూస్ ఛానెళ్ల రూపకల్పనలో కీలకంగా ఉన్నారు. ఇదే అనుభవంతో ఒకటి, రెండు ఛానెళ్ల స్థాపనకు కృషి చేశారు.

ప్రజా సంబంధాల్లో…
యాజమాన్యాలతో ఉండే దగ్గరితనం, తన బాస్ లతో ఉండే మంచితనం, తన పనితనం, సుదీర్ఘ అనుభవం మార్గం మరో ప్రస్థానానికి నాందీ పలికాయి. ఎక్స్ ప్రెస్ కి పడుతున్న బ్రేకులని, అప్పుడప్పుడు అందని సిగ్నల్స్ ని గుర్తించిన మార్గం లక్ష్మీనారాయణ, మరోదారి పట్టారు. అప్పుడే ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా సంబంధాల అవసరం ఏర్పడింది. వేగం, తేజం, పనితనం ఉన్న జర్నలిస్టుల ద్వారా ప్రజా సంబంధాలను మెరుగు పరచుకోవాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకు మంత్రుల దగ్గర అప్పటికే కొందరు జర్నలిస్టులు పిఆర్ఓలుగా చేరారు. అదే సమయంలో మార్గం కి అప్పటి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి దగ్గర ప్రజా సంబంధాల అధికారిగా అవకాశం వచ్చింది. కానీ, జర్నలిజం కెరీర్ ని వదులుకున్నట్లు అవుతుందా? కొత్త కెరీర్ ని కొనసాగించగలమా? అన్న మీమాంస మార్గం మనసులోకి వచ్చింది. అంతకుముందే ఎక్స్ ప్రెస్ టీవీలో ఉండగానే మార్గం కి మిషన్ భగీరథ పథకానికి పిఆర్ఓ గా అవకాశం వచ్చినట్లే వచ్చి, చేజారింది. అప్పట్లో అంతగా ఆ అవకాశంపై ఆసక్తి చూపని మార్గం, వైద్య మంత్రి వద్ద పిఆర్ ఓ పదవిని ఓ ఛాలెంజ్ గా తీసుకోవాలని భావించారు. పిఆర్ఓగా చేరి ఆ శాఖకు, మంత్రికి వన్నె తెచ్చారు. ఓవైపు పిఆర్ఓ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, సేవా తత్పరతతో అనేక మందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు నిలిపారు. ఇంకా వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. మరోవైపు తన జర్నలిజం నైజాన్ని చాటుతూ, వర్తమాన అంశాలపై, వైద్య ఆరోగ్య సమస్యలపై నిరంతరం వ్యాసాలు రాశారు. ప్రభుత్వ పనితీరు మీద, పథకాల మీద తనదైన శైలిలో విశ్లేషణాత్మక, తులనాత్మక వ్యాసాలను ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, తెలంగాణ మాస పత్రికల్లో మార్గం తన వ్యాసాంగాన్ని కొనసాగించారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ లో ప్రజా సంబంధాల అధికారిగా మరో అవకాశం మార్గం ని వెతుక్కుంటూ వచ్చింది. తెలంగాణలో వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వంలో రెండో సారి ప్రజా సంబంధాల అధికారిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. hmtv యాజమాన్యం మార్గం ను ఔట్ పు ట్ ఎడిటర్ గా అవకాశం ఇచ్చింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తనకు తోడుగా రమ్మని పిలిచారు. అక్కడ పి.ఆర్.ఓ. గా ఉన్న మార్గం వెంటపడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తనకు, తాను నిర్వహిస్తున్న శాఖలకు పి.ఆర్.ఓ. గా పిలిచారు. ప్రస్తుతం అక్కడే కొనసుగుతున్నరు. తనదైన శైలిలో అక్కడ కూడా ఆయా శాఖల ప్రగతి పై ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వివిధ దిన, మాస పత్రికల్లో అనేక వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.

ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా...
పలు పత్రికలకు వ్యాసాలు రాస్తూనే, అలాగే కొన్ని పత్రికలకు ఎక్సిక్యూటివ్ ఎడిటర్ గా, ఎడిటోరియల్ బోర్డు బెంబర్ గా కూడా ఉన్నారు. చారిత్రక ఓరుగల్లు నుంచి వెలువడిన “ఓరుగల్లు టైమ్స్” కి ఎక్సక్యూటివ్ ఎడిటర్ గా రెండేళ్ళపాటు పని చేశారు. “అభిప్రాయం” అనే పత్రికని ప్రారంభించి, కొంత కాలం నిర్వహించారు. ప్రఖ్యాత జర్నలిస్టు ఎంఎస్ ఆచార్య ఆధ్వర్యంలో నడిచిన “వరంగల్ వాణీ” సాయంకాల దిన పత్రికకు అనేక వ్యాసాలు రాశారు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా కోస్గి నుంచి వెలువుడిన “ప్రజా అంకురం” పక్ష పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా పని చేశారు. “సాక్షి”లో ఉప సంపాదకుడిగా పని చేశారు.

బోధనానుభవం
మార్గం, వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో బి.సి.జె., ఎం.సి.జె. కోర్సులను బోధించారు. ఎస్ డి ఎల్ సి ఇలో మొదటి బ్యాచ్ స్టూడెంట్ అయిన మార్గం, రెండో బ్యాచ్ నుంచే కౌన్సెలర్ కావడం విశేషం. కాగా, తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.సి.జె. కోర్సు కి గెస్ట్ లెక్చరర్ గా వ్యవహరిస్తున్నారు.

పాఠ్య రచయితగా...
మార్గం లక్ష్మీనారాయణ, వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (బీసీజె) కోర్సు రైటర్ కూడా…

రచనలు-రచనా సహకారం
2000 మార్చి 4న మహాశివరాత్రి సందర్భంగా… ఆవిష్కృతమైన “శ్రీ పాలకుర్తి లక్ష్మీనర్సింహస్వామి మహాత్మ్యం” అనే హ్యాండ్ బుక్ కు మార్గమే రచయిత. అయితే ఆ ఆలయ పూజారి దేవగిరి రామన్నతోపాటు సహ రచయిత గా పేరు ఉంటుంది. అలాగే ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు అమలు తీరును వివరిస్తూ సి.ఎం. గారి అప్పటి పి.ఆర్.ఓ. గటిక విజయ్ కుమార్ రాసిన “తెలంగాణ బంగారు బాట” వ్యాసాల సంపుటి, తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి దాకా… అనేక అంశాలపై రాసిన చారిత్రాత్మక “తెలంగాణ ఉజ్వల ప్రస్థానం” గ్రంథాల ఎడిట్ బాధ్యతలు నిర్వర్తించారు.

డాక్టర్ మార్గం లక్ష్మీ నారాయణ జీవిత చరిత్ర

 

డాక్యుమెంటరీ రైటర్ గా
కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డి.ఆర్. డి.ఎ. ఆధ్వర్యంలో నిర్మించిన “నేత బజార్” డాక్యుమెంటరీకి స్క్రిప్ట్ రాశారు. అలాగే కొన్ని యాడ్ ఫీచర్స్, బాల భారతం వంటి టీవీ సీరియల్స్ కి, నలుపు వంటి లఘు చిత్రాలకు స్క్రిప్టులనందించారు.

సినిమా రంగంలో…
1990లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సినిమాకు తన గురువు ఉపాధ్యాయ (దిడ్డి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ టీచర్, ఖిలా వరంగల్) గారి దగ్గర మార్గం అసిస్టెంట్ స్క్రిప్టు రైటర్ గా పని చేశారు. ఇదే సినిమాలో సుద్దాల అశోక్ తేజ, కాతోజు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ ఏలె తదితరులు పని చేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సినిమాతోపాటు తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో… ఆ మహోద్యమంలో మహిళల పాత్రని ప్రధానంశంగా, హీరోయిన్ ఓరియెంటెడ్ గా 1994లో నిర్మితమైన “నిరంతరం” సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమాని ఆ నలుగురు సినిమా దర్శకులు చంద్ర సిద్ధార్థ సోదరుడు రాజేంద్రప్రసాద్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి చంద్ర సిద్ధార్థ ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా.

కాస్ట్యూమర్ గా
ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే లో కెమెరా విభాగంలో శిక్షణ తీసుకున్న రాజేంద్ర ప్రసాద్, “నిరంతరం” సినిమాని “డిసర్టేషన్” కింద తీశారు. “యే జమీన్” పేరుతో హిందీలో డబ్ చేశారు. ఈ సినిమాకు మార్గం పూర్తి స్థాయి కాస్ట్యూమర్ గా పని చేశారు. సినిమా టైటిల్స్ లో కాస్ట్యూమర్ గా సింగిల్ కార్డు టైటిల్ మార్గం లక్ష్మీనారాయణ పేరున పడుతుంది.

సినీ నటుడిగా…
“నిరంతరం” సినిమాలో సహ హీరోగా మార్గం పూర్తి నిడివిగల క్యారెక్టర్ వేశారు. అందులో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన మరాఠీ అమ్మాయి “చిన్మయి సుర్వే” హీరోయిన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచే వచ్చిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత “రఘువీర్ యాదవ్” చిన్మయి భర్తగా లీడ్ రోల్ పోశించారు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన మీరానాయర్, నానా పటేకర్, అమితాబ్, సంజయ్ లీలా భన్సాలీ వంటి దిగ్గజులతో పని చేసిన రఘువీర్ యాదవ్ తో కలిసి నటించే అవకాశం రావడం మార్గంకి దక్కిన గొప్ప అవకాశం.

డబ్బింగ్ ఆర్టిస్టుగా…
“నిరంతరం” సినిమాలోనే రఘువీర్ యాదవ్ కి తెలుగు డబ్బింగ్ చెప్పారు మార్గం. ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో వారం రోజుల పాటు జరిగిన డబ్బింగ్ సెషన్స్ లో మార్గం రఘువీర్ యాదవ్ కి డబ్బింగ్ చెప్పారు.

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు పని చేసిన మార్గం, మరికొన్ని అవకాశాలను కూడా వదులుకున్నారు. వివిధ కారణాల వల్ల కొందరు ఇచ్చిన ఆఫర్లను కాదన్నారు.

Biography of Dr. Margam Lakshmi Narayana

కవి, కథారచయితగా
మార్గం కి చిన్నప్పటి నుంచే కవితలల్లడం అలవాటు. అదికాస్తా కథలల్లడం వరకు వచ్చింది. జర్నలిస్టు అవడంతో అది మరింతగా రాటు దేలింది. వాస్తవ నేపథ్యంలో అల్లిన కవిత్వాలు అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి. ఇన్ ఫార్మర్, బతుకమ్మ వంటి అనేక కథలు రాశారు మార్గం.

కార్టూనిస్టుగా...
చదువుకునే రోజుల్లోనే మార్గంని వ్యంగ్య వీచికలు ఆకర్షించాయి. సమకాలీన పత్రికల్లో వచ్చే కార్టూన్లతో ప్రభావితమైన మార్గం, కార్టూన్లు కూడా గీశారు. కొన్ని కార్టూన్లు తాను చదివిన ఆర్ట్స్ కాలేజీ మేగజైన్ జ్యోతిలో అచ్చయ్యాయి. అముద్రిత కార్టూన్లు అనేకం.

సోమనాథ కళాపీఠం వ్యవస్థాపకులుగా..
తొలి తెలుగు విప్లవ కవి, ఆకాశ మార్గాన పయనిస్తున్న పండిత భాషని పామరుల భాషగా భూమార్గం పట్టిచ్చిన తొట్టతొలి మహాకవి, ఆదికవి పాల్కురికి సోమనాథుడు. సోమనాథుడి పేరుతో ఆయన జన్మ స్థలం పాలకుర్తిలో 1992 జూన్ 24న సోమనాథ కళా పీఠం స్థాపించారు. డాక్టర్ రాపోలు సత్యనారాయణ, టీచర్ పెట్లోజు భాస్కరాచారి, అప్పటి లైబ్రేరియన్ అల్లం మధుసూదనరావులతో కలిసి పీఠాన్ని సాహిత్య, సామాజిక, సాంస్కితిక వేదికగా రూపొందించారు. నాటి నుంచి నేటి దాకా నిరాటంకంగా తిరుమల రామచంద్ర, సామల సదాశివ, కపిలవాయి లింగమూర్తి, లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, డాక్టర్ అరురీ సుధాకర్, దాకా ఎంతో లబ్ధ ప్రతిష్టులైన పరిశోధకులకు, అకాడమిషియన్లకు, ఆచార్యులకు, ఔత్సాహిక కవులు, కళాకారులు, స్కాలర్లు, రిసెర్చర్లు, సాహిత్యకారులను ప్రోత్సహిస్తూ, సత్కరిస్తున్నారు. వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పీఠం పనుల్లో పాలు పంచుకుంటున్నారు. సాహితీ లోకంలో జాతీయ స్థాయిలో అత్యంత గౌరవనీయ సంస్థగా నిలిచిన సోమనాథ పీఠం లబ్ధ ప్రతిష్టులకే కాదు… ఔత్సాహికులకు కూడా అరుదైన వేదిక.

మూఢ నమ్మకాల నిర్మూలనకు..
పీఠం ఆధ్వర్యంలో అక్షర దీపిక, మద్య నిషేధం వంటి పలు కీలక అంశాలపై, మూఢ నమ్మకాలపై, అంతరించి పోతున్న చిందు వంటి యక్షగానాలపై, అనేక సామాజిక, సాంస్కృతిక కళారూపాల కార్యక్రమాల నిర్వహణ జరిపిస్తున్నారు.

సోమనాథ ఉత్సవాలకు చేయూత
సోమనాథ కళా పీఠం, సోమన సాహితీ సమితి ల సహకారంతో 1994 ఫిబ్రవరి 27, 28, మార్చి 1 తేదీల్లో తెలుగు విశ్వవిద్యాలయం పాలకుర్తిలో నిర్వహించిన “సోమనాథ అష్టమ శత జయంతి” ఉత్సవాలకు సోమనాథ కళాపీఠం కీలక భాగస్వామి. పీఠం ప్రధాన కార్యదర్శిగా ఉత్సవాల విజయవంతానికి మార్గం అవిరళ కృషి సల్పారు. ఆనాడు కాళోజీ, ఆచార్య పేర్వారం జగన్నాథం వంటి దిగ్గజాలతో వేదికను పంచుకున్నారు.

సోమనాథ విగ్రహ ప్రతిష్టాపన
1995లో తెలుగు విశ్వవిద్యాలయం చేత పాలకుర్కి సోమనాథ విగ్రహ తయారీకి, తర్వాత శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ప్రాంగణంలో ఆ విగ్రహ ప్రతిష్టాపనకు మార్గం లక్ష్మీ నారాయణ విశేష కృషి చేశారు. విశ్వ విద్యాలయానికి, దేవస్థానానికి మధ్య సమన్వయం కర్త గా వ్యవహరించారు.

అవార్డుల నిర్ణాయక మండలి సమన్వయకర్తగా
సోమనాథ కళా పీఠం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డుల నిర్ణాయక మండలికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టు, దివంగత జి.కృష్ణ, ప్రఖ్యాత రచయిత ఉపాధ్యాయ, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్, సామాజిక తత్వవేత్త బి.ఎస్ రాములు వంటి ఉద్ధండులున్న అవార్డుల నిర్ణాయక మండలికి సమన్వయ పరిచే బాధ్యతలు నిర్వర్తించడం మార్గం ప్రతిభకు నిదర్శనం.

టీవీ అవార్డుల న్యాయ నిర్ణేతగా
2011 నేషనల్ టెలివిజన్ అవార్డుల కమిటీ (హైదరాబాద్) జ్యూరీ మెంబర్ గా వ్యవహరించారు. పలువురు ప్రముఖులతోపాటు మార్గం న్యాయ నిర్ణేతగా, టీ వీ కార్యక్రమాల్లో
వివిధ విభాగాల్లో ఆయా కార్యక్రమాలను పరిశీలించి, విజేతలను ఎంపిక చేశారు.

జాతీయ సెమినార్లలో పరిశోధనా పత్రాల సమర్పణ
* “మీడియా అండ్ గుడ్ గవర్నెన్స్” అనే అంశంపై మార్చి 31, 2012న కాకతీయ విశ్వవిద్యాలయంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం నిర్వహించిన, యూజీసీ సమర్పించిన జాతీయ సెమినార్ లో మార్గం పత్ర సమర్పణ చేశారు.

* “గిరిజన భాషా సంస్కృతి, సాహిత్యాలు-నేటి అవసరాలు” అనే అంశంపై 2012లో సెప్టెంబర్ 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సెమినార్ లో మార్గం పత్ర సమర్పణ చేశారు.

*తెలంగాణ విశ్విద్యాలయం, నిజామాబాద్, జర్నలిజం శాఖ “అంబేద్కర్ మరియు ఆదర్శవంతమైన జర్నలిజం” (“DR.B.R.Ambedkar and ideological Journalism”) అనే అంశంపై, 2020 జనవరి 29-31 తేదీల్లో నిర్వహించిన జాతీయ సెమినార్ లో “పద్మశాలి పత్రిక ప్రారంభానికి 97 ఏండ్లు!” అనే పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించారు.

తెలంగాణ ఉద్యమంలో వివిధ సంస్ధల తో..

1999లోనే రాజ్యసభ మాజీ సభ్యులు, అప్పటి జర్నలిస్టు-గ్రంథకర్త రాపోలు ఆనందభాస్కర్ గారితో కలిసి మార్గం లక్ష్మీ నారాయణ తెలంగాణ ప్రగతి వేదిక ఏర్పాటులో కీలకంగా పని చేశారు. ఆనందభాస్కర్, డాక్టర్ రాపోలు సత్యనారాయణలతో కలిసి తెలంగాణ వాద పరివ్యాప్తికి, ప్రగతికి, తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల సభలు, సమావేశాలు, సదస్సులు, గోష్ఠులు నిర్వహించారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్, ఆచార్య బియ్యాల జనార్దన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి వరదారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి వంటి వాళ్ళతో కలిసి తెలంగాణ ప్రజలను జాగృత పరిచారు.

ఒకవైపు జర్నలిస్టుగా పని చేస్తూనే… మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారారు. తను పని చేస్తున్న చోట్ల తెలంగాణ ఉద్యమానికి మార్గ నిర్దేశనం అయ్యారు మార్గం. అనేక మందిని ఉద్యమ కార్యోన్ముఖులని చేశారు. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. తన రాతలతో ఉద్యమ ఉధృతికి పాటుపడ్డారు. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని, ఆనాటి ఉద్యమ నేతలు కాళోజీ, కొండా లక్మణ్ బాపూజీ వంటి వాళ్ళెందరినో ఇంటర్వ్యూలు చేశారు. గద్దర్, పీపుల్స్ వార్ నేతలతోనూ అనేక ఇంటర్వ్యూలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. ఉద్యమ ద్రోహులని నిలదీశారు. విద్యార్థి శిక్షణలో భాగంగా ఉద్యమనేత కెసిఆర్ హన్మకొండ హయగ్రీవాచారి కాంపౌండ్ స్థలంలో నిర్వహించిన కార్యక్రమంలో “జై తెలంగాణ!” అంటూ మొట్టమొదటి సారిగా జై కొట్టింది మార్గమే! ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా యాజమాన్యాలలో పని చేస్తూనే, తెలంగాణ ఉద్యమానికి వేదికగా నిలిచిన టిఆర్ ఎస్ కి బహిరంగంగా ధైర్యంగా మార్గం మద్దతు పలికారు. ఆ తర్వాత వరంగల్ జర్నలిస్టులంతా నిలబడి తమ మద్దతు తెలిపారు. ఈ సంఘటనని ప్రత్యేకంగా ప్రస్థావించిన కెసిఆర్, జర్నలిస్టుల మద్దతు మరువలేనిదన్నారు. అలాగే ప్రజావాగ్గేయ కారులు అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, వరంగల్ శ్రీనివాస్, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ వంటి వాళ్ళందరితోనూ తెలంగాణ సాంస్కృతికోద్యమ పరివ్యాప్తికి పాటు పడ్డారు. అంతే కాదు అనేకానేక మందిని ఇంటర్వ్యూలు చేసి ఉద్యమానికి ఊతంగా మార్గం నిలబడ్డారు. ఆనాడే నమస్తే తెలంగాణలో పని చేయడానికి అవకాశం వచ్చినా వద్దన్నారు. ఆనాడు వరంగల్ ఎంపీ గా ఉన్న వినోద్ కుమార్ ఈ అవకాశాన్ని ప్రస్తావించగా, జెమినీ న్యూస్ ఛానెల్ కు అవుట్ పుట్ ఎడిటర్ గా ఉన్న మార్గం సున్నితంగా వద్దన్నారు. తెలంగాణ వాదులంతా తెలంగాణ మీడియా లో చేరిపోతే, ఆంధ్రా ప్రభావిత చానల్స్ తో తెలంగాణ వాణి వినిపించేలా మనవాళ్లు అన్ని తెలంగాణ వ్యతిరేక మీడియాల్లో ఉండాలని చెప్పారు. ఆ విధంగా వచ్చిన అనేక అవకాశాలను ఉద్యమం కోసం వదులుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ, వాటిని ఎదుర్కొంటూ పని చేశారు.

2009, డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వ తెలంగాణ ప్రక్రియని ప్రారంభిస్తున్నామన్న ప్రకటన సమయంలో, అప్పటికే డెంగీ మహమ్మారి బారిన పడి తృటిలో ప్రాణాపాయం నుండి బయట పడి కోలుకుంటున్న మార్గం, కెసిఆర్ నిరాహార దీక్ష చేస్తూ, చికిత్స పొందుతున్న నిమ్స్ ఆవరణలోనే ఆ రాత్రంతా ఉన్నారు. ఆతర్వాత కేంద్రం యూ టర్న్ తీసుకున్న సమయంలోనూ జర్నలిస్టుగా మార్గం తన కలానికి మరింత పదను పెట్టారు. జర్నలిస్టుగా వివిధ పత్రికలు, మీడియాలో పని చేస్తూనే…ఆయా పత్రికలు, మీడియాల్లో తెలంగాణ వార్తలకు తగిన ప్రాధాన్యం దక్కే విధంగా చూశారు. అలా తెలంగాణ ఏర్పడే వరకు తెలంగాణ ఉద్యమంలో… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వ0లో కెసిఆర్ కిట్ వంటి పథకాల రూపకల్పనలో, ఆయా పథకాల ప్రచార, అమలు తీరు తెన్నులను ప్రజలకు చేరవేసే బాధ్యతల్లో భాగంగా ప్రజాసంబంధాల అధికారిగా…ప్రభుత్వానికి-ప్రజలకు అనుసంధానకర్తగా కూడా వ్యవహరిస్తూనే ఉన్నారు.

జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటులో..కీలకంగా

అలాగే జర్నలిస్టులకు హెల్త్ కార్డుల జారీ, well ness center ల ఏర్పాటు, జర్నలిస్టుల కు వైద్యం, మందులు అందడం లో కూడా మార్గం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ప్రజా సంబంధాల అధికారిగా చాలా కీలకంగా పని చేశారు.

ప్రజా సంబంధాల అధికారిగా..
జర్నలిస్టుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి చేసిన కృషి మరో అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే దాకా అలుపెరుగని ఉద్యమబాటలో… ఆతర్వాత తెలంగాణ ప్రభుత్వం-పాలనలోనూ ప్రముఖ పాత్ర పోషించే అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ప్రజా సంబంధాల అధికారిగా అవుట్ సోర్సింగ్ లో పని చేశారు. ఇప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ లో ప్రజా సంబంధాల అధికారిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ సి లక్ష్మారెడ్డికి, ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ శాఖలు నిర్వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కి, ఆ శాఖలకు మంచి పేరు తెస్తున్నారు. జర్నలిస్టుగా ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో మార్గం, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల పథకాల రూపకల్పన, అమలులో కీలకంగా మారారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఉచితంగా అందించే వైద్య పథకంలో జర్నలిస్టులను కూడా చేర్చడంలో మార్గం లక్ష్మీనారాయణ పాత్ర చాలా ముఖ్యమైంది.

మార్గం ఫౌండేషన్- స్టూడెంట్ ఫర్ సేవ – సేవా కార్యక్రమాలు

మార్గం ఫౌండేషన్ ని స్థాపించి, ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు మార్గం. అలాగే స్టూడెంట్ ఫర్ సేవ సంస్థ ద్వారా కరోనా కష్టకాలంలో నిరుపేదలను ఆదుకున్నారు. స్వచ్ఛ పాలకుర్తి సహా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు.

అవార్డులు-రివార్డులు
* 1999లో వెన్నెల ఆర్ట్ క్రియేషన్స్ వాళ్ళు ఇచ్చిన ఉత్తమ జర్నలిస్టు అవార్డు

* 2008లో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్ డి ఎల్ సి ఇ వాళ్ళు ఎక్సలెన్సీ ఇన్ టీచింగ్ సర్టిఫికేట్ నిచ్చి సత్కరించారు.

సన్మానాలు-సత్కారాలు
* 2005లో వాసవీ క్లబ్, వాసవీ వనితా క్లబ్ పాలకుర్తి వారి సన్మానం

* 2005లో లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ వారి సత్కారం

* 2007లో లయన్స్ క్లబ్ ఆఫ్ హసన్ పర్తి వారి సన్మానం

* 2007లో వాసవీ వనితా క్లబ్ వారి సత్కారం

మార్గం గా మారిన లక్ష్మీనారాయణ?!
ఇంటి పేరుతోనే గుర్తుంపు పొందిన మార్గం…అసలు పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ మార్గంగా మారడం వెనుక ఓ సినిమా కథ ఉంది. 1990లో తన గురువు ఉపాధ్యాయ కలం పేరుతో చిరపరిచితులు దిడ్డి లక్ష్మీనారాయణ టీచర్ తో కలిసి బీఆర్ అంబేద్కర్ అనే సినిమాకి పని చేయడానికి హైదరాబాద్ వెళ్ళారు. ఆ సినిమా డైరెక్టర్ ఉదయ్ కుమార్. ప్రస్తుత ఎమ్మెల్సీ నారదాసు లక్మణ్ రావు మరికొందరితో కలిసి తీసిన అవార్డు సినిమాకి “విముక్తి కోసం” కి కూడా ఆయన డైరెక్టర్. ఉపాధ్యాయ రైటర్. అయితే, అంబేద్కర్ సినిమాకి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన డాక్టర్ పద్మావతి నిర్మాత. అప్పట్లో ఆ సినిమాకి ఆర్థిక సహకారం కేంద్రం నుంచి అందడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ కూడా సాయం చేశారు. అప్పుడు కేంద్ర సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్ తో మాట్లాడి పెట్టింది టంకశాల అశోకే. అశోక్ కూడా దిడ్డి లక్మీనారాయణ సారు శిష్యుడు. అయితే తొలిసారిగా పాటల రచయితగా సుద్దాల అశోక్ తేజ ఆ సినిమాకి పని చేయడానికి వచ్చారు. ఉపాధ్యాయ, అశోక్ తేజ, డైరెక్టర్ ఉదయ్, నిర్మాత పద్మావతిలతో కలిసి మార్గం లక్ష్మీనారాయణ పనిచేశారు. ఆ సమయంలో మార్గం చేతి రాతే పూర్తి స్థాయి స్క్రిప్టు… అంటే మార్గం చేతి రాత అంత అందంగా ఉండేదన్నమాట. తలలోనాలుకలా, అందరి నోళ్ళల్లో నానే మార్గం లక్ష్మీనారాయణను అంత పొడవైన పేరుతో పిలవడం ఇబ్బందీగా మారింది. దీంతో అప్పటికే కాస్తో కూస్తో రాసే అలవాటున్న మార్గం లక్ష్మీనారాయణ డైరీని చూసిన సుద్దాల అశోక్ తేజ, ఇంత మంచి పేరు పెట్టుకుని అంత పొడవుగా పిలవడం కష్టం..రా… అందుకే ఇక నుంచి నీ పేరుని మార్గంగా మారుస్తున్నా… అంతా మార్గమనే పిలుస్తామని నిర్ణయించారు. దీంతో అప్పటి నుంచి అందరికీ మార్గంగా మారిపోయారు మార్గం లక్ష్మీనారాయణ. ఆ తర్వాత లక్ష్మీనారాయణ పరిచయం మార్గంగానే మారి… అలాగే కొనసాగుతున్నది.

 

డా.మార్గం
లక్ష్మీ నారాయణ
భారతీయ పాత్రికేయులు, తెలంగాణ

maarrgam@gmail.com