ఆలూ గోబీ మసాలా కర్రీ
కావలసిన పదార్థాలు:
నూనె – రెండు టీస్పూన్లు, జీలకర్ర – ఒక టీస్పూన్, పసుపు – అర టీస్పూన్, దాల్చిన చెక్క – చిన్నముక్క, కారం – ఒక టీస్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, బంగాళదుంపలు – రెండు, నీళ్లు – ఒకకప్పు, గోబీ(క్యాలీఫ్లవర్) – అరకేజీ, మెంతి – ఒకకట్ట, గరంమసాలా – పావు టీస్పూన్, కొత్తిమీర – ఒక కట్ట, బిర్యానీ ఆకు – ఒకటి.
ఉల్లిపాయ-టొమాటో పేస్టు కోసం : నూనె – రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూన్, టొమాటోలు – రెండు, జీడిపప్పు – ఎనిమిది పలుకులు.
తయారీ విధానం:
ముందుగా ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి వేగించాలి. టొమాటోలను చిన్నగా కట్ చేసి వేయాలి. టొమాటోలు కాసేపు వేగాక జీడిపప్పు పలుకులు వేసి వేగించాలి. చల్లారిన తరువాత వాటన్నింటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా తయారుచేసుకోవాలి. మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేగించాలి.
తరువాత కారం, పసుపు వేసి చిన్న మంటపై వేగించాలి. ఇప్పుడు ఉల్లిపాయ- టొమాటో పేస్టు వేసి కలపాలి. ధనియాల పొడి, ఉప్పు వేయాలి. బంగాళదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. కాసేపు ఉడికిన తరువాత గోబీ ముక్కలు వేసి చిన్నమంటపై పావుగంట ఉడికించాలి. చివరగా మెంతి ఆకులు, గరంమసాల, కొత్తిమీర వేసి కలపాలి. కాసేపయ్యాక దింపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చపాతీలోకి లేదా అన్నంలోకి ఆలూ గోబీ మసాలా రుచిగా ఉంటుంది.
No comments
Post a Comment