తన్మాత్రలు
పరమాత్మనాశ్రయించుకొని మాయ ఉన్నది. పరమాత్మ పురుషుడు. మాయ స్త్రీ (భార్య) ఆ మాయ త్రిగుణాత్మకం. అంటే సత్త్వ, రజ, తమః అనే 3 గుణాలు ఉన్నాయి. మరి “వారికి పుట్టిన బిడ్డలే 5 భూతాల తన్మాత్రలు”. బిడ్డలకు తల్లి చాలు. అందువల్ల ఈ పంచభూతాల తన్మాత్రలకు ఈ 3 గుణాలూ వచ్చాయి.
ఈ 5 తన్మాత్రల నుండే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, 4 అంతఃకరణాలు, స్థూలశరీరం వచ్చాయి. అయితే ఏ గుణం వల్ల ఏమి వచ్చాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ముందుగా సాత్త్వికగుణం నుండి వచ్చిన వాటి గురించి…
i) ఆకాశ తన్మాత్ర సాత్త్వికాంశం వల్ల శ్రోత్రేంద్రియం – వినేశక్తి
ii) వాయు తన్మాత్ర సాత్త్వికాంశం వల్ల త్వక్ ఇంద్రియం – స్పర్శించేశక్తి.
iii) అగ్ని తన్మాత్ర సాత్త్వికాంశం వల్ల చక్షురింద్రియం – చూచేశక్తి.
iv) జల తన్మాత్ర సాత్త్వికాంశం వల్ల రసనేంద్రియం – రుచి చూచేశక్తి.
v) పృథివీ తన్మాత్ర సాత్త్వికాంశం వల్ల ఘ్రాణేంద్రియం – వాసన చూచేశక్తి.
ఈ 5 తన్మాత్రల సమిష్టి సాత్త్వికాంశం వల్ల మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే 4 అంతఃకరణాలు వచ్చినవి. పంచభూతాలతో తయారైనదే మానవ దేహం. దేహం అంటే స్థూలదేహం, సూక్ష్మదేహం రెండూ కూడా.
కాకపోతే స్థూలదేహం పంచీకరణం చెందిన పంచభూతాల తామసికాంశం నుండి తయారైంది. సూక్ష్మదేహం పంచీకరణం చెందని పంచభూతాలు అంటే.. తన్మాత్రల స్వాత్త్విక, రాజసిక అంశాల వల్ల తయారైంది. ఇందులో సాత్త్వికాంశాల వల్ల తయారైనవి 5 జ్ఞానేంద్రియాలు. 4 అంతఃకరణాలు బయట వ్యవహరించేవి గనుక జ్ఞానేంద్రియాలను బాహ్యకరణాలంటారు.
లోపల వ్యవహరించేవి గనుక మనోబుద్ధ్యాదులను అంతఃకరణాలంటారు. జ్ఞానేంద్రియాలు విషయజ్ఞానాన్ని మనస్సుకు అందిస్తాయి. ఆ జ్ఞానాన్ని విశ్లేషణ చేసేవి మనోబుద్ధులు. సత్త్వగుణం జ్ఞాన సంబంధమైనది గనుక జ్ఞానేంద్రియాలను అంతఃకరణాలను ఇస్తున్నదీ సత్వగుణం.
ఈ జ్ఞానేంద్రియాలన్నీ ఆయా వేరువేరు తన్మాత్రల నుండి వస్తుంటే – 4 అంతఃకరణాలు 5 తన్మాత్రల సమిష్టి సాత్త్వికాంశాల నుండి వస్తున్నాయి.
ఈ విధంగా 5 జ్ఞానేంద్రియాలు + 4 అంతఃకరణాలు = మొత్తం 9 తత్త్వాలు పంచభూతాల సత్త్వగుణం నుండి వచ్చినవి…
|| ఓం నమః శివాయ ||
No comments
Post a Comment