మాలికాపురత్తమ్మ ఆలయం శబరిమలై పూర్తి వివరాలు
?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️
ఆ దివ్యమంగళ స్వరూపుడు , భక్తుల పాలిట సులభ సాద్యుడు , అభయ ప్రదాయకుడు , ఆ శాస్తా రూపం లో ఇమిడి ఉన్న అయ్యప్పస్వామిని కన్నుల కరువు తీరా దర్శించి పడమర దిక్కునుంచి క్రిందికి దిగి వస్తారు భక్తులు.
అయ్యప్పస్వామిని దర్శించి ప్రశాంతత నిండిన హృదయాలతో భక్తులు మాలికాపురత్తమ్మ గుడిని చేరుకుంటారు (ఇప్పుడు రెండు గుడుల మధ్య వంతెన కట్టబడి వున్నది)
*మాలికాపురత్తమ్మ ఆలయం*
మణికంఠుని చేత దైవత్వాన్ని పొందిన మహిషి , మంజల్ మాతా పేరిట , దేవీ శక్తిగా లోకపావని అని పిలువబడుతూ ఇక్కడ కొలువై వున్నది !
మాలికాపురత్తమ్మగా భక్తులను కాపాడుతూ , వారి కోర్కెలను తీర్చ వలసిందిగా అయ్యప్ప చెప్పిన ప్రకారం తనను దర్శించేవారికి శుభాలు ప్రసాదిస్తుంది మాలికాపురత్తమ్మ ! ఈమెను దర్శించుకుని రవిక గుడ్డలు , పసుపు , కుంకుమలు సమర్పిస్తారు ! అమ్మవారికి సమర్పించిన రవిక గుడ్డలు ఋతుక్రమం సమయంలో స్త్రీలు వాడరాదు. పెళ్లికాని కన్యలు , మంచి భర్తకై ప్ర్రార్థించి , శబరిమల వెళ్ళు భక్తుల ఇరుముడులో తమ స్వహస్తాలతో వేసి , తమ కోర్కును వారు ఆ దేవాది దేవుడి కి చెప్పుకుంటారు. ఇరుముడిలో సమర్పిస్తారు. అమ్మను దర్శించుకున్న భక్తులు , ఆ రవికలు అమ్మకు ఇచ్చి పూజ చేయించి , తీసుకుని వచ్చి ఆ కన్యలకు ఇస్తారు. వారు రవికెలు కుట్టించుకుంటారు ! ఆ తల్లి తన వివాహ కోర్కెను , వీరికి వివాహ ప్రాప్తిని కలిగించి , వరం ప్రసాదించి తృప్తి పడుతుంది.
ఇక్కడ టెంకాయలు కొట్టరు ! ఇరుముడి లోని ఆ కాయను , దొర్లించి గుడిలో వదిలేస్తారు ! పేలాలు , అటుకులు జల్లుతూ ప్రదక్షిణలు చేస్తారు !
ఏడాదికి ఒకమారు , అమ్మ , - అయ్యప్ప చెప్పిన మాటపై కోలాహలంగా, శరంగుత్తి వచ్చి చూస్తుంది. అక్కడి కన్నిస్వాములు విడిచిన శరములను చూచి , ఈ సంవత్సరం కూడా కన్నిస్వాములు వచ్చినట్లు గ్రహించి ప్రతి సంవత్సరంలా నిరుత్సాహం చెందుతూ ఉంటుంది మాలికాపురత్తమ్మ ! (కన్నిస్వాములు రాని సంవత్సరం , ఆమెను వివాహం చేసుకుంటానని మణికంఠస్వామి చెప్పారు) అందువల్ల ఆ విధంగా జరగటానికి అవకాశం లేకుండా ప్రతి సంవత్సరం కన్నిస్వాముల సంఖ్య ఎక్కువవుతూనే వుంటున్నది.
మాలికాపురత్తమ్మ ఆలయం దర్శించిన తర్వాత గణపతి ఆలయం , నాగరాజు - నాగయక్షిణిల ఆలయాలను దర్శించుతారు ! ఇక్కడ పూజలు చేసి , నాగులమీద పాటలు పాడతారు ! ఆ విధముగా చేయడంవల్ల సర్వ సర్పదోషాలు , జాతక రీత్యా సంభవించు కష్ట నష్టాలు , తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పిదప మధ్యలో వచ్చే , అయ్యప్ప మిత్రుల ఆలయాలను కూడా దర్శిస్తారు !
*భస్మకొలను*
ప్రస్తుతం ఈ కోనేరు స్వామి గుడి వెనుక భస్మకొలను పేరిటనున్నది. ఇందులో భక్తులు స్నానం ఆచరించి , తడిబట్టలతో , స్వామి ఆలయమునకు , పొర్లు దండాలు చేస్తారు. బసకు తిరిగి వెళతారు
*ఇరుముడి విప్పటం:*
మండల దీక్ష , యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని , ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని ఎంతో తృప్తినిండిన హృదయాలతో ఇరుముడలను , గురుస్వాములకు అప్పగిస్తారు దీక్షాధారులు !
గురుస్వామి ఇరుముడులను విప్పి పూజా సామగ్రిని వేరుచేస్తారు ! ముందుగా ముద్ర కాయను పగులగొట్టి అందులోని నేతిని వేరుగా ఒక పాత్రలోకి వేస్తారు ! ఈ నేతి పాత్రతో , గంధం , పంచామృతాలు , విభూది వేరు వేరు పాత్రలలో తీసుకుని దీక్షాధారులు తిరిగి అయ్యప్ప గుడికి వెళ్లి స్వామికి నెయ్యాభిషేకం చేయించి , ఆ నేతిని ప్రసాదంగా స్వీకరించి తమ వెంట తీసుకువెళతారు.
స్వామికి అభిషేకం చేసిన
ఈ నెయ్యి పరమ పవిత్రమైనది ! సర్వరోగ నివారిణి ! దీర్ఘరోగాలతో భాధపడేవారు , ఈ నెయ్యిని కొద్దిగా సేవించటం వల్ల సత్వరంగా ఉపశమనం లభిస్తుంది ! ప్రసాదపు నెయ్యిని జాగ్రత్తగా ఇళ్ళకు తీసుకువెళతారు. అభిషేకానంతరం పూజా ద్రవ్యాలను , గంధం , కొబ్బరికాయలను సమర్పించుతారు ! ముద్ర కాయ కొబ్బరి చిప్పలు గుడి ముందున్న హోమ గుండంలో వేస్తారు. గణపతి హోమంలో వేసిన కొన్నిటిని ప్రసాదంగా తీసుకుంటారు. తరువాత విభూదిని పళ్లెంలో వేసుకుని , కర్పూర హారతి చూపి , భస్మం ఇతరభక్తులమీద జల్లుతూ అమ్మవారి గుడిని చేరి , ఇరుముడిలో నుండి వేరు చేసిన రవిక గుడ్డలు , పూజాద్రవ్యాలు సమర్పించి తిరిగి రవిక గుడ్డలు ప్రసాదంగా తీసుకొని వస్తారు ! ఇరుముడిలో కట్టి తెచ్చిన మిరియాలను వావరు స్వామి గుడిలో సమర్పిస్తారు .
ఇరుముడి తలమీద పెట్టుకుని స్వామిని దర్శించటం , తిరిగి దానిని విప్పి తెచ్చిన నెయ్యి , ఇతర పూజా ద్రవ్యాలు స్వామికి సమర్పించి ప్రసాదాల తో తిరుగుప్రయాణం కోసం భద్రపరచుకోవడం పూర్తయిన తర్వాత సాయంత్రం మకర జ్యోతి దర్శనం కోసం ఆత్రంగా ఎదురుచూడటం మొదలౌతుంది !
స్వామివారి ఆభరణాలు కూడా ఆ రోజు సాయంత్రానికే సన్నిధానం చేరుకుంటాయి !
*స్వామివారి ఆభరణాలు:*
స్వామి రాకుమారుడుగా ధరించిన ఆభరణాలను పందల రాజు , స్వామి తండ్రి అయిన రాజశేఖరుని
విన్నపాన్ని అంగీకరించి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు వాటిని స్వామి విగ్రహానికి అలంకరించడం జరుగుతున్నది ! ఆ ఆభరణాలు వుంచిన మూడు పెట్టెలు పంబల రాజవంశీయుల అధీనంలో ఉంటాయి ! మకర సంక్రాంతినాడు పెట్టెలను ఉత్సవంగా మేళతాళాలతో తలమీద వుంచుకుని బయలుదేరుతారు. ప్రస్తుత రాజవంశం రాజు , అప్పుడు స్వయంగా , అయ్యప్ప ఇచ్చిన కరవాలంతో నగల తో పాటు వస్తారు. ఆ సమయం లోనే ఆకాశమార్గాన పెద్ద గరుడ పక్షి ఎగురుతూ , పెట్టెలకు రక్షణగా , శబరిమల దాకా వచ్చి ఆలయం పై ప్రదక్షణాలు చేసి వెళ్ళి పోతుంది. శబరిమలమీద వున్న భక్తులకు ఆ పక్షి కనబడుతుంటుంది. దాన్ని చూసి ఆభరణాల పెట్టెలు బయలుదేరాయని గ్రహిస్తారు భక్తజనం .
???????????
No comments
Post a Comment