*?️?అయ్యప్ప స్వామి మండలకాల దీక్ష??️*
అయ్యప్ప దీక్ష కేవలం 40 రోజుల పాటు గడిపే నియమబద్ధ జీవితం కాదు. అది *అద్వైతానికి* దిక్సూచి. ఆత్మ, పరమాత్మల సంయోగానికి వారిధి. వేదాంతసారమైన ఉపనిషద్వాక్యాల్ని జీవనసారంగా మలుచుకునేందుకు మనిషి తనకు తానుగా పాడుకునే ఆత్మ *చైతన్యగీతిక.* ఎన్నో అనుభవాలు. మరెన్నో అనుభూతులు. అన్నీ కలిస్తే... మహోన్నతమైన పరివర్తనకు అంకురార్పణే "అయ్యప్ప దీక్షాధారణ."
 
కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా... నాయకుడైనా, శ్రామికుడైనా... దీక్ష తీసుకున్న మరుక్షణం నుంచి మనిషి నియమధారి అవుతాడు. చన్నీటి స్నానం, నల్లనివస్త్రాలు, తులసి, స్ఫటికమాలలు, విభూది, గంధం ధరించడం, కటిక నేలపై శయనించడం, ఏకభుక్తం, పాదరక్షల్ని విడిచిపెట్టడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, త్రికాలాల్లోనూ స్వామి అర్చన, తోటివారందరినీ స్వామీ అని సంబోధించడం... ఇలా అన్ని రకాలుగా మనిషి దైవంగా మారే సాధన కనిపిస్తుంది.
40 రోజుల దీక్ష పూర్తిచేసుకుని శబరిమల స్వామి ఆలయాన్ని చేరుకుని, పదునెట్టాంబడి ఎక్కగానే ఆలయం ముందుభాగంలో *‘తత్త్వమసి’* అనే మహావాక్యం కనిపిస్తుంది. ఇది వేదసారం, ఉపనిషద్బోధ. తత్‌, త్వం, అసి అనే మూడు పదాల కలయిక తత్త్వమసి. *‘అది నీవై ఉన్నావు’* అనేది ఈ వాక్యానికి అర్థం. ఇన్ని రోజుల పాటు కఠోర నియమాలు ఆచరించి, ఏ స్వామి దర్శనానికి వచ్చావో ఆ స్వామి నీవేనంటూ దీక్షాధారుడికి ప్రబోధిస్తుంది ఈ వాక్యం.
దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఆ వ్యక్తిని అందరూ ‘స్వామీ’ అని సంబోధిస్తారు. ఇది నియమం. దీక్ష తీసుకున్న వ్యక్తి ఏ దైవాన్నయితే ఆరాధిస్తున్నాడో ఆ స్వామి పేరుతోనే ఇతరులనూ సంబోధించడం ఇక్కడ విశేషం. శివాభిషేక ప్రారంభంలో చదివే మహన్యాసం *‘నా రుద్రో రుద్రమర్చయేత్‌’*- తాను స్వయంగా రుద్రుడిగా మారి రుద్రుడిని అర్చించాలి. లేకపోతే శివారాధనకు అధికారం లేదని చెబుతుంది. అయ్యప్పదీక్ష కూడా వేదప్రతిపాదితమైన ఈ వాక్యాన్ని అనుసరిస్తుంది. దీక్షాధారుడు స్వయంగా *‘స్వామి’గా* మారి అయ్యప్పస్వామిని అర్చించటం ఇందులోని అంతరార్థం.



*‘దేహో దేవాలయః ప్రోక్తో జీవోదేవస్సనాతనః’*..
. దేహమే దేవాలయం. జీవుడే పరమేశ్వరుడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తనలో ఉన్న పరమేశ్వరతత్త్వాన్ని మనిషి గుర్తించే దీక్ష తీసుకుంటాడు కాబట్టే ఆ క్షణం నుంచి జీవుడు దేవుడుగా మారుతాడు. దేవాలయాన్ని ఎలాగైతే అత్యంత శుచిగా ఉంచుతారో దేహాన్ని కూడా అలాగే ఉంచుకుంటారు. భూశయనం ఆత్మ నిగ్రహాన్ని, శీతలస్నానం శారీరక శక్తిని ఇస్తాయి. కఠిన నియమాలు దీక్షాధారులు పాటించడం వెనుక ఉన్న *ఆధ్మాత్మిక* సందేశం ఇది.
అయ్యప్ప దీక్షాధారులందరూ పూర్తిగా *నల్లని వస్త్రాలు* ధరించాలని నియమం. అన్ని వర్ణాల్నీ తనలో కలుపుకునే లక్షణం నలుపునకు మాత్రమే ఉంది. అంతిమంగా దీక్ష తీసుకున్న వ్యక్తి పరమాత్మలో లీనం కావడాన్ని నల్లని వస్త్రధారణ ప్రకటిస్తుంది. నలుపు *తమోగుణానికి* సంకేతం. దాన్ని ఆదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ప్రతి మనిషికీ ఉంది. ఈ కర్తవ్యాన్ని వస్త్రధారణ ప్రతిక్షణం గుర్తుచేస్తుంది.
స్వాములు కనుబొమల మధ్య గంధం, కుంకుమ ధరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కనుబొమల మధ్యలో *సుషుమ్న నాడి* ఉంటుంది. ఇక్కడ పరమాత్మ జ్ఞానరూపంలో జ్యోతిలా ప్రకాశిస్తుంటాడు. ఈ ప్రదేశాన్ని గంధం, కుంకుమతో అలంకరించటం ద్వారా మనలోనే ఉన్న పరమాత్మను అర్చించే ఆధ్యాత్మిక భావనకు అయ్యప్పదీక్ష బీజం వేస్తుంది.
అయ్యప్పపూజలో ప్రధానాంశం *‘శరణు ఘోష’.* అనేక విధాలైన స్తోత్రాలు, నామాలతో అయ్యప్పను ఆరాధిస్తారు. మనిషిలో ఉండే యవ్వనం, అందం, అనుభవించే భోగభాగ్యాలు ఇవేవీ *శాశ్వతం* కావు. స్వామి పాదాలను శరణు వేడడమే *ముక్తికి మార్గం.* భవబంధాలను విడిచి స్వామి చరణాలను పట్టుకునేందుకు మనిషి మనస్సును సన్నద్ధం చేసే ఆధ్యాత్మిక సాధన శరణుఘోష ప్రధానాశయం.
ఇరుముడి అంటే *రెండు ముడులు లేదా ముడుపులని అర్థం.* శబరిమల యాత్రకు బయల్దేరే ముందు రెండు భాగాలుగా ఉన్న ఇరుముడిని స్వాములు ధరిస్తారు. ఈ రెండు ముడులూ భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు. ఇరుముడిని బంధించే తాడు ప్రణవానికి ప్రతీక. భక్తి, శ్రద్ధలను ప్రణవంతో బంధిస్తే (సాధన చేస్తే) పరమాత్మను చేరుకోవటం సాధ్యమవుతుందని చెప్పటమే ఇరుముడి అంతరార్థం. దీక్షితుడికి అవసరమైన పదార్థాలు ఉండే భాగంలో గురుస్వామి మూడు గుప్పెళ్లు బియ్యం వేస్తారు. ఈ మూడు గుప్పెళ్లు ఆధిదైవిక (మెరుపులు, వర్షాలు వగైరా), ఆధి భౌతిక (భూకంపాలు, అగ్నిప్రమాదాలు వగైరా), ఆధ్యాత్మిక (జడత్వం, అరిషడ్వర్గాలు వగైరా) విఘ్నాలు కలగకుండా ఉండటానికి దైవసంకల్పంతో ఇచ్చే *ఆశీరక్షతలు.*
 శబరిమలకు చేరుకుని, స్వామిని దర్శించిన తర్వాత ఇరుముడిలోని కొబ్బరికాయను హోమగుండంలో సమర్పిస్తారు. "యజ్ఞం" అంటే సమర్పణ భావం. తనను తాను దైవానికి సమర్పించుకోవటం మనిషి చేసే సాధనలో తుది అంకం. ఆ తర్వాత వ్యక్తి పూర్ణత్వాన్ని సంతరించుకుంటాడు. శాస్త్రాలు కూడా *‘యజ్ఞోహి శ్రేష్ఠతం కర్మా’*- మనిషి ఆచరించే కర్మలన్నిటిలో యజ్ఞాలు ఉత్తమమైనవని చెబుతున్నాయి. ఉత్తమ క్రియల ద్వారా పూర్ణతాన్ని సాధించటమే కొబ్బరికాయను అగ్నికి సమర్పించటంలో భావం.●
*‘ఆర్య’, ‘పితా’* అనే ఆర్షశబ్దాలకు దేశీయరూపాలైన పదాలు *‘అయ్య’, ‘అప్ప’. ఈ రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది అయ్యప్ప అనే పదం. ఈ అయ్యప్ప పరమాత్మ స్వరూపం. శివుడు, విష్ణువు, లలిత అనే రూపాలన్నీ మన భావనలే కానీ పరమాత్మ స్వరూపం ఒక్కటేనని వేదాంతం చెబుతోంది. *‘పుం రూపా విష్ణువిగ్రహా’* అని *లలితోపాఖ్యానం చెప్పినట్లు మోహినీరూపంలో ఉన్న విష్ణువు సాక్షాత్తు శక్తి (లలిత) స్వరూపం. శివ, విష్ణు తత్త్వాల సంయోగరూపమే అయ్యప్పస్వామి.* అంటే అఖండ విశ్వమంతా నిండిఉన్న శక్తిస్వరూపం అయ్యప్ఫ ఒకే పరతత్త్వం సాధకుల సౌలభ్యం కోసం వివిధ రూపాల్లో ప్రకటితమవుతుందని మహర్షుల వచనం. శివ, కేశవ సంయోగరూపమైన అయ్యప్పస్వామి యోగ, జ్ఞానమయ మంగళమూర్తిగా శబరిగిరి మీద భక్తులకు దర్శనమిస్తున్నారు.
అయ్యప్పకు *‘ధర్మశాస్త’* అనే పేరుంది. శాస్త అంటే *గురువు* అని అర్థం. *ఆదిశంకరులు కూడా ‘శాస్తారం ప్రణమామ్యహం’ అంటూ స్వామిని స్తుతించారు.* ఇది ధర్మం, ఇది యోగం అని శాసించి ఆచరింపజేసేవాడు కనుకనే గురుస్వరూపుడైన అయ్యప్పను "‘శాస్త’" అన్నారు. అయ్యప్ప నిరంతరం చిన్ముద్ర ధరించి ఉంటారు. బొటనవేలు చూపుడు వేలు కలిపి ఉంచటాన్ని *"చిన్ముద్ర"* అంటారు. జ్ఞానానికి ప్రతీక అయిన దక్షిణామూర్తి చిన్ముద్ర ధరించి ఉంటారు. అయ్యప్పకూడా ఈ ముద్ర ధరించటమంటే ఈ స్వామి దక్షిణామూర్తి స్వరూపమని అర్థం చేసుకోవాలి. మండల కాలం (40 రోజులు) దీక్ష పవిత్రభావనతో చేసిన వారికే సన్నిధానంలో 18 మెట్లు ఎక్కే అవకాశం దక్కుతుంది. మండలం అనేది చాలా శాస్త్రీయమైన సంఖ్య. మానవ శరీరం మానసిక చైతన్యవ్యవస్థగా రూపుదిద్దుకోవటానికి 40 రోజుల సమయం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయుర్వేదం కూడా ఒక మందును 40 రోజులు ఉపయోగిస్తేనే ఫలితం ఉంటుందని చెబుతుంది. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మండలదీక్ష నిర్ణయించారు.
శబరిమల స్వామి దర్శనానికి ముందుగా స్వాములు 18 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దీన్నే పదునెట్టాంబడి అంటారు. ఇది పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతం. ఈ మెట్లన్నీ మంత్రపూరితాలు. దీక్షాధారులు చేసిన మంత్రసాధన అనుసరించి ఇవి ఫలితాన్నిస్తాయి. వీటిని చాలా భక్తితో స్పర్శించాలి. ఈ మెట్లు ఎక్కి స్వామిని దర్శించడమంటే సాధనలో చివరి అంకాన్ని చేరుకున్నట్లువుతుంది. అయ్యప్పస్వామి ఆలయంలో ప్రతిష్ఠితుడైన సందర్భంగా మృదంగ, భేరీ, కాహళ, దుందుభి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, ఢక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే 18 వాద్యాలను మోగిస్తారు. 18 మెట్లకు ఇవి ప్రతీకలు. ఈ వాద్యాల్లో ప్రతిధ్వనించే లయ, నాదాలన్నీ స్వామిని ప్రణవ "స్వరూపుడిగా" ప్రకటిస్తాయి.
శబరిమల ఆలయ ధ్వజస్తంభం ముందు "గుర్రం విగ్రహం" ఉంటుంది. అది చంచల స్వభావానికి, కోరికలకు ప్రతీక. దుందుడుకుగా ఉండే గుర్రాన్ని ఎలాగైతే రౌతు అదుపులో ఉంచుతాడో కోరికలకు సాధకుడు భక్తి అనే కళ్లెం వేసి నియంత్రించాలనేది సందేశం. ఆలయంలో నిత్యం రాత్రివేళ వినిపించే *‘హరివరాసనం’* లో స్వామిని ‘వాజివాహనం’, ‘తురగవాహనం’ అని  సంబోధించటంలో ఉన్న అంతరార్థం ఇదే.
*ఓం స్వామి శరణం.. స్వామి యే శరణం అయ్యప్ప.*
??